పంద్రాగస్ట్ లోగా పంటరుణాలు మాఫీ చేస్తా: రేవంత్‌

April 21, 2024


img

శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలలో రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ కూడా ఒకటి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ హామీని అమలుచేయలేకపోయామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్తున్నారు.

కానీ ఈ ఎన్నికల ప్రక్రియ ముగియగానే పంట రుణాల మాఫీ హామీని అమలుచేస్తామని నిన్న మెదక్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మెదక్ చర్చి సాక్షిగా ఈ ఏడాది ఆగస్ట్ 15లోగా పంట రుణాల మాఫీ హామీని అమలుచేస్తామని ప్రజలకు మాట ఇస్తున్నానని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అంతే కాదు... వచ్చే సీజనులో పండించే వడ్లకు రూ.500 చొప్పున బోనస్ కూడా ఇస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు మాట ఇచ్చారు. 

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికరంలోకి రాగానే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ప్రభుత్వానికి పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంలో సుమారు 30 శాతం కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలు కట్టేందుకు సరిపోతోందని చెప్పారు.

పైగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న హామీలతో రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఆర్ధిక భారం పెరిగింది.

ఈ పరిస్థితులలో లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున పంట రుణాలు మాఫీ చేయాలంటే వేలకోట్లు అవసరం. అంత సొమ్ముని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుందో తెలీదు. కానీ పంట రుణాల మాఫీ హామీని అమలు చేస్తామని చెపుతూ దానికి ఆగస్ట్ 15 గడువు కూడా ప్రకటించారు సిఎం రేవంత్‌ రెడ్డి. 


Related Post