పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ మళ్ళీ జంప్?

April 19, 2024


img

పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ ఇటీవలే బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మళ్ళీ పెద్దపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణకు టికెట్‌ ఇవ్వడంతో ఆయన బీజేపీతో టచ్చులోకి వెళ్ళారు. 

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో, బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌ పోటీని తట్టుకొని గెలవలేరని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ సమయంలో పెద్దపల్లి నుంచి 2019లో గెలిచిన సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ టచ్చులోకి రావడంతో బీజేపీ అధిష్టానం శ్రీనివాస్‌ని తప్పించి ఆయనను బరిలో దింపాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా ఇద్దరూ వెంకటేష్‌ని బీజేపీలో చేర్చుకొని పార్టీ అభ్యర్ధిగా నిలిపేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసిన్నట్లు తెలుస్తోంది. కనుక నేడో రేపో బోర్లకుంట వెంకటేష్ బీజేపీలో చేరిపోవడం, బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడం ఖాయమే అని భావించవచ్చు.

ఇదే కనుక జరిగితే పెద్దపల్లిలో కాంగ్రెస్‌ (గడ్డం వంశీకృష్ణ), బిఆర్ఎస్ (కొప్పుల ఈశ్వర్‌), బీజేపీ (బోర్లకుంట వెంకటేష్) మద్య హోరాహోరీగా ముక్కోణపు పోటీ జరగడం అనివార్యమే. ముక్కోణపు పోటీ జరిగితే ఓట్లు చీలి కాంగ్రెస్‌ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 


Related Post