తెలంగాణాలో ఏమి జరుగుతోంది?

November 07, 2016


img

ఈమద్యన దేశంలో రాష్ట్రాలకి, మంత్రులకి కొత్తగా ర్యాంకుల బెడద ఒకటి వచ్చిపడింది. అది ఎప్పటి నుంచో అమలులో ఉన్నప్పటికీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి మంత్రం జపిస్తునందున, ఈ మార్కులు, ర్యాంకులు చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. అవి అనుకూలంగా ఉన్నట్లయితే అధికార పార్టీలు వాటి గురించి గొప్పగా డప్పు కొట్టుకొంటాయి. ఆ ర్యాంకులని ప్రతిపక్షాలు ఒప్పుకోవు. అది వేరే సంగతి! కానీ వ్యతిరేకంగా ఉన్నట్లయితే ప్రతిపక్షాలు, మీడియా కూడా వాటిని పట్టుకొని ప్రభుత్వాలని చీల్చి చెండాడేస్తాయి.

ఈమద్యన వరుసగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్: 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్: 1 ర్యాంకులు సంపాదించుకొన్నందుకు శబాషీలు, పాలాభిషేకాలు చేసుకొంటున్న తెరాస సర్కార్ కి మళ్ళీ పెద్ద షాక్ తగిలింది. 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌.సి.ఏ.ఈ.ఆర్‌.) స్టేట్ ఇన్వెస్ట్ మెంట్  పొటన్షియల్ ఇండెక్స్ పేరిట తాజాగా ప్రకటించిన సర్వే ఫలితాలలో, తెలంగాణా రాష్ట్రం పెట్టుబడులని ఆకర్షించడంలో 13వ స్థానంలో ఉన్నట్లుగా ప్రకటించింది. ఈ విషయంలో ఎప్పటిలాగే గుజరాత్ నెంబర్: 1 స్థానం దక్కించుకాగా దాని తరువాత స్థానాలలో వరుసగా డిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. 

ఇప్పటికే అనేక బారీ పరిశ్రమలతో కూడిన హైదరాబాద్ ఉన్నప్పుడు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్: 1 స్థానం సంపాదించుకొని, పెట్టుబడులని ఆకర్షించడంలో తెలంగాణా ప్రభుత్వం ఎందుకు వెనుకబడిపోయింది? అనే సందేహం కలుగుతోంది. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్: 1 స్థానం సంపాదించుకొన్న సందర్భంగా మంత్రి కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించామని, వాటివలన ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు కల్పించామని గణాంకాలు వివరించారు. ఒకవేళ ఎన్‌.సి.ఏ.ఈ.ఆర్‌. సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలో అనేక అంశాలని ప్రాతిపదికగా తీసుకొని అధ్యయనం చేసి చెపుతున్న ఈ విషయం నిజమేననుకొన్నట్లయితే, రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరిగిపోతోందని తెరాస సర్కార్ ప్రజలని మభ్యపెడుతొందనుకోవాలేమో? కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ని గర్వంగా స్వీకరించిన తెరాస సర్కార్, ఇప్పుడు ఈ ఎన్‌.సి.ఏ.ఈ.ఆర్‌. ర్యాంక్ ని కూడా స్వీకరిస్తుందా లేదో?


Related Post