తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పదేళ్ళ తర్వాత తెలంగాణలో అందరికీ ముఖ్యంగా ముఖ్యంగా ఉద్యోగులు చాలా స్వేచ్ఛ లభించిన్నట్లు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నిరంకుశత్వం, నిర్బంధాలు, ఆంక్షలు లేవు. ప్రజాస్వామ్యం పునరుద్దరించబడింది.
సిఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కంచెలు తొలగింపజేసి సామాన్య ప్రజలను లోనికి ఆహ్వానించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సచివాలయంలోకి కూడా సామాన్య ప్రజలు రాగలుతున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆయనను మెచ్చుకుంటున్నారు.
మరో విషయం ఏమిటంటే ఈ నెల ఉద్యోగులందరికీ 4వ తేదీలోగా జీతాలు వేశారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో తమ తమ శాఖలను సమీక్షిస్తూ పాలనలో చురుకుదనం, పారదర్శకతని చూపుతున్నారు. మొత్తం మీద నెల రోజుల కాంగ్రెస్ పాలన చాలా సంతృప్తికరంగానే ఉంది.
అయితే బిఆర్ఎస్ నేతలు ప్రజాతీర్పుని గౌరవించకపోవడం చాలా దురదృష్టకరం. పైగా ఏదోవిదంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్నట్లు బెదిరిస్తున్నారు. బిఆర్ఎస్ నేతలు ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదని వారి మాటలను బట్టి అర్దమవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది కానీ కాంగ్రెస్‌లో విలీనం చేయబోము. ఎన్నికలలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు మా పార్టీకి రెండు ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్ధానం చేసింది. సిఎం రేవంత్ రెడ్డి కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
అయితే పదవులు, అధికారం కోసం మేము కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వలేదు. రాష్ట్రంలో నిరంకుశపాలన అంతమొందించి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్దరించాలనే మద్దతు ఇచ్చాము. మా ఆలోచనలు, ప్రయత్నాలు ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.