మాజీ సిఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు శాసనసభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని, రాజకీయంగా చాలా చైతన్యం కలిగినవారని పదేపదే చెప్పిన సంగతి ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుంది. కానీ కేటీఆర్ అప్పుడే మరిచిపోయిన్నట్లున్నారు. ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తమను కాదని కాంగ్రెస్‌ని గెలిపించారని అన్నారు.
తెలంగాణ భవన్‌లో గురువారం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశ్యించి కేటీఆర్ మాట్లాడుతూ, “మనం పోడు భూముల పట్టాలను పంపిణీ చేశాము.
తొమ్మిదిన్నరేళ్ళలో 6,74,479 తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే కూడా చాలా ఎక్కువ జీతాలు పెంచాము. అలాగే పింఛన్లు కూడా 29 లక్షల నుంచి 46 లక్షలకు పెంచాము.
మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు అమలుచేసినా వాటి గురించి ప్రజలకు చెప్పుకోలేకపోయాము. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో గెలుస్తామనే నమ్మకం లేనందున నోటికి వచ్చిన్నట్లు హామీలు ఇచ్చేసింది. ప్రజలు వాటినే నమ్మారు తప్ప మనం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పధకాలను చూడలేదు.
మనం కూడా పనులు చేయడం కంటే ప్రచారం ఎక్కువ చేసుకుని ఉంటే తప్పకుండా గెలిచేవాళ్లం. కానీ మనం ఎల్లప్పుడూ ప్రజలు, సంక్షేమం, రాష్ట్రం, అభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాము.
అందుకే ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించకుండా మూడో వంతు సీట్లు ఇచ్చారు. కనుక ఇక నుంచి పార్టీ నేతలతో, పార్టీ అనుబంద సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గట్టిగా కృషి చేస్తాము.
శాసనసభ ఎన్నికలలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొందాము. కేసీఆర్ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ మన సత్తా చాటుకుందాము,” అని కేటీఆర్ అన్నారు.