కోదండరామ్‌కు ఖచ్చితంగా బంపర్ ఆఫర్?

January 12, 2024


img

తెలంగాణ ఉద్యమాలలో పోరాడిన టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను కేసీఆర్‌ పక్కన పెట్టినా తమ ప్రభుత్వం ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని, ఆయన వంటి మేధావి శాసనమండలిలో ఉండాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఇటీవలే చెప్పారు.

వీలైతే ఈ నెలాఖరులోగానే ఆయనతో సహా కాంగ్రెస్‌ని గెలిపించడం కోసం కృషిచేసిన వారందరికీ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవులలో నియమించాలని అనుకుంటున్నట్లు సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.  

కనుక ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి ఆయనకు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... సిఎం రేవంత్‌ రెడ్డి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొని విద్యాశాఖను అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంతవరకు ఆ శాఖని ఎవరికీ కేటాయించకుండా తన వద్దే అట్టేబెట్టుకుని ఉండవచ్చు.

ఆయనను మంత్రివర్గంలో తీసుకోవాలనుకుంటున్న విషయం సిఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలియజేసిన్నట్లు సమాచారం. బహుశః దీని కోసం చర్చించేందుకే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని ఢిల్లీ పంపిన్నట్లు తెలుస్తోంది. కనుక సంక్రాంతి పండుగకు ప్రొఫెసర్ కోదండరామ్‌కు శుభవార్త వినిపించే అవకాశం ఉంది. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ పక్కన పెట్టినా ప్రొఫెసర్ కోదండరామ్‌ పదేళ్ళపాటు నిరంతరంగా రాజకీయాలలో ఉండటం ఇప్పుడు కలిసి వస్తోంది.


Related Post