తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిఎం రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం 12 మంది మంత్రులున్నారు. కనుక మరో ఆరుగురుకి అవకాశం ఉంది. సిఎం రేవంత్ రెడ్డి వద్ద నాలుగు శాఖలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా మిగిలిన వారి దగ్గర తలో రెండు శాఖలు ఉన్నాయి.
కనుక మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఎదురుచూస్తున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. కనుక రాష్ట్రంలో 17 స్థానాలకు 17 మందికి అవకాశం ఉంది.
ఈ నేపధ్యంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన నిన్న ఢిల్లీకి బయలుదేరి వెళ్ళగా, సిఎం రేవంత్ రెడ్డికి కూడా పిలుపూ రావడంతో వీటి గురించి చర్చించేందుకే అని అందరూ భావిస్తున్నారు. అయితే సిఎం రేవంత్ రెడ్డికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఆయన బదులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కాబోతున్నారు.
ఎన్నికలలో ఓడిపోవడంతో జగ్గారెడ్డి మళ్ళీ పోటీ చేయబోనని చెపుతున్నారు. కానీ తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్లని సంతృప్తిపరిస్తే మరిన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు వారు కృషి చేస్తారు. అలాగే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక వలన కూడా కాంగ్రెస్‌లో సీనియర్లను సంతృప్తి పరచవచ్చు. బహుశః ఈ విషయాలు చర్చించేందుకే కాంగ్రెస్ అధిష్టానం సిఎం రేవంత్ రెడ్డికి కబురు పెట్టి ఉండవచ్చు.
కనుక సంక్రాంతి పండుగ తర్వాత లేదా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోగా తప్పకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చు. ఫిబ్రవరి 20లోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతున్నారు కనుక ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.