బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ శాసనసభ కార్యాలయం నేడు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.
నేటి నుంచి ఈ నెల 18వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. ఈ నెల 20 నుంచి 22వరకు నామినేషన్స్ ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్స్ జారీ చేయడం వలన వేర్వేరు ఎన్నికలుగానే పరిగణించబడతాయి. కనుక కాంగ్రెస్‌కున్న 64 మంది ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ ఎమ్మెల్యే మద్దతుతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోబోతోంది.
కడియం శ్రీహరి, పాడి కౌశిక్ ఎమ్మెల్యేలుగా గెలిచినందుకు బిఆర్ఎస్ పార్టీ సంతోషపడాలో లేక వారు ఖాళీ చేసిన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి.