శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమికి పార్టీ పేరు మార్పు కూడా ఓ కారణమని ఆ పార్టీలో పలువురు వాదిస్తున్నారు. వారిలో సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా ఒకరు.
లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలలో ఆయన ఈ విషయం లేవనెత్తిన్నట్లు తెలుస్తోంది. ప్రజలు బిఆర్ఎస్‌ని తమ పార్టీగా భావించకపోవడం వలననే శాసనసభ ఎన్నికలలో 1.86 శాతం తేడాతో ఓడిపోయామని కడియం శ్రీహరి అన్నారు.
టిఆర్ఎస్ పేరుతో తెలంగాణతో బలమైన బంధం, సెంటిమెంటు ఉండేవని అలాగే ప్రజలు కూడా టిఆర్ఎస్‌ని తమ సొంత పార్టీ అనుకునేవారని కడియం అభిప్రాయపడ్డారు.
పార్టీలో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా ఇదే అనుకొంటున్నారని, బిఆర్ఎస్‌ని మళ్ళీ టిఆర్ఎస్‌గా మార్చేందుకు గల అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నారని కడియం శ్రీహరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూచించారు.
ఒకవేళ పేరు మార్చడం వలన న్యాయపరంగా, రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని భావిస్తే, బిఆర్ఎస్ పేరుని జెండాని అలాగే ఉంచేసి, మళ్ళీ టిఆర్ఎస్ పేరుతో, జెండాను ఉపయోగించుకునేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కడియం శ్రీహరి సూచించిన్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్‌గా మార్చుతున్నప్పుడే పార్టీలో పలువురు అభ్యంతరాలు తెలిపిన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఆయనను అప్పుడు ఎదిరించలేక మౌనంగా ఉండిపోయిన నేతలు ఇప్పుడు ఆ తప్పుని సవరించుకోవాలని హితవు పలుకుతున్నారనుకోవచ్చు.
కానీ ఇందుకు కేసీఆర్ ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకున్నా ఈసీ ఇందుకు ఒప్పుకుంటుందా?ఒకవేళ కేసీఆర్, ఈసీ కూడా ఒప్పుకున్నా ప్రజలకు, కాంగ్రెస్, బీజేపీలకు బిఆర్ఎస్ నేతలు ఏమని చెప్పుకుంటారు?అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.