కొన్ని తప్పిదాల వల్లే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోయిందని ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే అవేమిటో చెప్పలేదు కానీ లోక్‌సభ ఎన్నికలలో ఆ తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలలోని పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు ఈరోజు తెలంగాణ భవన్‌లో జరిగిన సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. వారిని ఉద్దేశ్యించి కేటీఆర్ మాట్లాడుతూ, “కోట్లాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళుగా కాపాడుకుంటూ అన్ని విదాలా అభివృద్ధి చేసుకున్నాము. అయితే పార్టీ పరంగా జరిగిన కొన్ని లోపాల వలన శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడంతో రాష్ట్రం మళ్ళీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుచుకుని మళ్ళీ మన రాష్ట్రాన్ని కాపాడుకొనే అవకాశం వచ్చింది.
మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు అప్పుడే హామీలు అమలుచేయలేక చేతులెత్తేస్తున్నారు. వారిని ప్రజలు కూడా నమ్మడం లేదు. కనుక మీ లోక్‌సభ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు ఇదే మంచి అవకాశం. కనుక అందరూ కలిసి కట్టుగా పనిచేసి మన పార్టీని, మన రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవలసి ఉంది,” అని అన్నారు.
బిఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ నేతలు వారి కోణంలోనే ఆలోచిస్తూ కాంగ్రెస్‌ని నిందిస్తూ సర్ధిచెప్పుకుని తృప్తిపడవచ్చు. చిన్న చిన్న తప్పిదాల వలన 10-12 స్థానాలలో స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పుకోవచ్చు. అయితే ఏ కారణంతో ఓడిపోయినా ఓటమి ఓటమే.
కనుక తమ ఓటమిని సమర్ధించుకొని ఆత్మవంచన చేసుకోవడం కంటే నిష్కర్షగా ఆత్మవిమర్శ చేసుకుని లోపాలు సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికలకు సిద్దమైతే బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధించగలదు. కానీ ఓటమికి కుంటిసాకులు చెప్పుకొని సంతృప్తిపడితే మళ్ళీ ఎదురుదెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.