కేసీఆర్‌ చాలా ప్రమాదకరమైన వ్యక్తి: కేటీఆర్‌

January 10, 2024


img

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన తండ్రి, మాజీ సిఎం కేసీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా ప్రమాదకరంగా ఉంటారు. సిఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్‌ అనే మూడు అక్షరాలు చాలా శక్తివంతమైనవి. శస్త్ర చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నారు. త్వరలోనే తెలంగాణ భవన్‌కు వచ్చి అందరినీ కలుస్తారు. ఫిబ్రవరి నుంచి ప్రజల మద్యకు వస్తారు,” అని చెప్పారు. 

కేటీఆర్‌ చెప్పింది అక్షరాలా నిజమే. శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓడిపోవడంతో ఆయనకు పెద్ద షాకే. కనుక దెబ్బ తిన్న పులిలా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా చకచకా పావులు కదిపి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి సిద్దంగా ఉన్నామని కేటీఆర్‌, హరీష్ రావు స్వయంగా చెప్పడమే ఇందుకు నిదర్శనం. 

అయితే కేసీఆర్‌ అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు మానుకుంటే మంచిదని సిఎం రేవంత్‌ రెడ్డి కూడా హెచ్చరించారు. ఒకవేళ కేసీఆర్‌ తమ ఎమ్మెల్యేలను లాగేసుకొని ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే తాము కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకొని బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. 

అయితే ఏదో ఓ రోజు కేసీఆర్‌ ప్రయత్నించక మానరు. అప్పుడు రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయక మానరు. అయితే కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి మద్య ఈ యుద్ధం ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రమే తేలాల్సి ఉంది. 

ముందుగా కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు లోక్‌సభ ఎన్నికలలో తమ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. రెండు పార్టీలు కనీసం 10-12 సీట్లు గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత, వాటి ఫలితాలను బట్టి, ముఖ్యంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయం తేలిన తర్వాత ఈ యుద్ధం వెంటనే మొదలవవచ్చు లేదా వాయిదా పడవచ్చు.                



Related Post