కాంగ్రెస్‌కి అడ్వాంటేజ్, బిఆర్ఎస్‌కి అగ్నిపరీక్ష!

January 09, 2024


img

తెలంగాణలో ఎదురేలేదనుకున్న బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓటమిని పూర్తిగా జీర్ణించుకోకమునుపే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోగా లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. 

పార్టీ క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ఇంటికే పరిమితం కావలసి రావడం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు చాలా కష్టమే. కానీ తన నాయకత్వాన్ని నిరూపించుకునేందుకు కేటీఆర్‌ ఇదీ మరో గొప్ప అవకాశమని భావించవచ్చు. అందుకే కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో వరుసగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌, కేటీఆర్‌ పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఇంకా స్పందించ వలసి ఉంది. అలాగే ఎమ్మెల్సీ, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితని ఈసారి పోటీ చేయించబోవడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై కూడా కేటీఆర్‌ స్పందించాల్సి ఉంది. 

ఒకవేళ కేసీఆర్‌, కేటీఆర్‌ లోక్‌సభ ఎన్నికలు పోటీ చేయడం, కల్వకుంట్ల కవితని పక్కన పెట్టడం నిజమైతే ఇది సంచలన విషయమే అని చెప్పవచ్చు. 

బిఆర్ఎస్ ఎన్నికలకు సిద్దమవుతుంటే, సిఎం రేవంత్‌ రెడ్డి ఈసారి కనీసం 12 ఎంపీ సీట్లు గెలవడమే తన లక్ష్యం అని ప్రకటించడం బిఆర్ఎస్ పార్టీకి పెను సవాలుగానే చూడవచ్చు. ఎందుకంటే, తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ఓడించి చూపారు.

కానీ ఇప్పుడు ఆయన నేతృత్వంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక యావత్ పోలీస్ యంత్రాంగం, ఉన్నతాధికారులు అందరూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం చాలా శ్రమించాల్సి వస్తుంది. 

ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోగలదు. కానీ ఓడిపోతే బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకి క్యూ కట్టే ప్రమాదం పొంచి ఉంటుంది.


Related Post