ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ వచ్చి మాజీ సిఎం కేసీఆర్‌ని పరామర్శించి వెళ్ళారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ బందోబస్తు కల్పించింది. కానీ కనీస మర్యాదకైనా కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని కలిసి పలకరించలేదు. సాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలకరించడం కంటే కేసీఆరే తనకు ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు.
“నేను సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేయలేదు... మర్యాదపూర్వకంగా పలకరించలేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. అయితే ఇంతకంటే అవమానకరంగా మాట్లాడారు గుడివాడ వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని.
విలేఖరులు ఆయనను దీని గురించి ప్రశ్నించినప్పుడు, “కేసీఆర్ కాలు విరిగి మంచన్న పడ్డారు కనుక జగన్ వెళ్ళి పలకరించారు. రేవంత్ రెడ్డికి కూడా కాలు విరిగిందా... వచ్చి పలకరించడానికి? రేవంత్ రెడ్డి అంత గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరించడానికి?మాకు ఆయన అపాయింట్మెంట్స్ అవసరం లేదు. మాకు ఏవైనా పనులు ఉంటే నేరుగా సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో మాట్లాడి చేయించుకోగలము. మేము ఆయనకి ఫోన్లు చేయనవసరం లేదు. వెళ్ళి కలవక్కరలేదు కూడా.
చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికే ఆయన వైఎస్ షర్మిలకు మద్దతు ఇస్తానంటున్నారు. దానికి బదులు ఆయన తన సిఎం పదవికి రాజీనామా చేసి వచ్చి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టవచ్చు కదా?” అని కొడాలి నాని అన్నారు.
కొడాలి నాని మంత్రిగా పనికిరారనే జగన్మోహన్ రెడ్డి ఆ పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు జగన్ కాదంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా లభించదు. అటువంటి వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన రేవంత్ రెడ్డి పట్ల ఇంత చులకనగా మాట్లాడటం అహంకారాన్ని సూచిస్తోంది.
జగన్ రాజకీయ గురువునే ఓడించిన రేవంత్ రెడ్డి గొప్పదనాన్ని కొడాలి నాని వంటివారు గ్రహించలేరు. తన వాచాలత్వం వలన రెండు రాష్ట్రాల సంబంధాలు ఇంకా దెబ్బ తింటాయనే సోయి కూడా లేదు. కానీ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?
(Video Courtesy: NTV)