బండ్ల గణేశ్ భజన, విమర్శలు రెండూ శృతిమించే....

January 09, 2024


img

ప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అవకాశం చిక్కినప్పుడల్లా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ భజన చేస్తుండటం అందరూ చూస్తూనే ఉంటారు. ఆయన భజన జాబితాలో ఇప్పుడు మరో పేరు చేరింది. అదే తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి! 

అయితే సినీ భజనలో ఎవరినీ విమర్శించనవసరం లేదు. కానీ రాజకీయ భజనలో మరొకరిని విమర్శిస్తేనే అది పరిపూర్ణమవుతుంది. కనుక రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ భజన చేసే ప్రయత్నంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.   

బండ్ల గణేశ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ కట్టుకున్న గడీలను తెరిచి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌లాగా ప్రగతి భవన్‌ లేదా ఫామ్‌హౌస్‌లోనే ఉంటాను బయటకు రాను... ఎవరినీ కలవను... నా తరపున నా కుటుంబ సభ్యులే రాష్ట్రాన్ని పాలిస్తారనలేదు సిఎం రేవంత్‌ రెడ్డి. నిత్యం ప్రజల మద్యే ఉంటూ ప్రజల కష్టానష్టాలను అడిగి తెలుసుకొంటున్నారు. మహాలక్ష్మి పధకంతో రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా బస్సులలో ప్రయాణించే సౌకర్యం కల్పించారు.

కేసీఆర్‌ అనుమతి లేకుండా ఏ మంత్రీ ప్రెస్‌మీట్‌ పెట్టలేరు. కానీ సిఎం రేవంత్‌ రెడ్డి తన మంత్రులందరికీ స్వేచ్ఛనిచ్చారు. కేసీఆర్‌ అహంభావంతో ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను కలవలేదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, అనుమతులు మంజూరు చేయమని కోరారు. మీ పదేళ్ళ పాలనలో మీరు (కేసీఆర్‌) ఎన్నిసార్లు ప్రధాని నరేంద్రమోడీని చెప్పండి సార్?” అంటూ బండ్ల గణేశ్ నిలదీశారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కంటే బండ్ల గణేశ్ వీరావేశంతో చేసిన ఈ భజన చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకీ ఈ భజన ఎమ్మెల్సీ సీటు కోసమేనా? అని సందేహం కూడా కలుగుతుంది.

(Video Courtesy: ABN Andhra Jyothy)

Related Post