శాసనసభ ఎన్నికలలో పెద్ద షాక్ తిన్న బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశాలు నిర్వహించుకొంటున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలలో గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా తన సత్తా చాటాలని అనుకుంటోంది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపైనే దృష్టి పెడుతున్నారు తప్ప మహారాష్ట్ర గురించి మాట్లాడటం లేదు.
శాసనసభ ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్‌తో సహా పలువురు బిఆర్ఎస్ నేతలు పలుమార్లు మహారాష్ట్రలో పర్యటించి ఆ రాష్ట్రంలో పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేసారు. ఈసారి ఎన్నికలలో మహారాష్ట్రలో అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తామని కేసీఆర్ చెప్పారు.
కానీ తెలంగాణలో ఓటమి తర్వాత బిఆర్ఎస్ ఆలోచనలు, ప్రాధాన్యతలు మారిన్నట్లు ఉన్నాయి.మహారాష్ట్రలో పార్టీని విస్తరించి అక్కడ గెలుపు కోసం ప్రయత్నించడం కంటే తెలంగాణలో బిఆర్ఎస్ పట్టు సడలిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని గుర్తించిన్నట్లే ఉన్నారు. బహుశః అందుకే మహారాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నా బిఆర్ఎస్ పార్టీ అటువైపు తొంగి చూడటం లేదేమో?
అయితే ఇప్పటికే మహారాష్ట్రలో బిఆర్ఎస్ విస్తరణ జరిగింది కనుక ఆ రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతలు పూర్తిగా స్థానిక నేతలకే అప్పగించాలని కేసీఆర్ భావిస్తుండవచ్చు. లేదా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సరికి ఆయన పూర్తిగా కోలుకుంటారు కనుక అప్పుడు మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయడం గురించి ఆలోచిస్తారేమో? కానీ ప్రస్తుతానికి మాత్రం బిఆర్ఎస్ మహారాష్ట్ర గురించి ఆలోచించడం లేదని చెప్పవచ్చు.