బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలలో మూడింట ఒక వంతు సీట్లు మనం గెలుచుకున్నాము. అదే... కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే మనమే గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగలిగి ఉండేవాళ్ళం. లోక్‌సభ ఎన్నికలలో అటువంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రతపడదాం.
నెలరోజుల కాంగ్రెస్ పాలనకే ప్రజలు విసుగెత్తిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతూ మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో మనకు చాలా అనుకూల వాతావరణం నెలకొని ఉంది. కనుక అందరం కష్టపడి పనిచేస్తే మెజార్టీ సీట్లు మనమే గెలుచుకోగలము.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన వాగ్ధానాలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయలేక, అప్పులు శ్వేతపత్రాలు అంటూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మనం ఇదే విషయం ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరిస్తే తప్పకుండా బిఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారు,” అని అన్నారు.
కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏడుగురిని మాత్రమే మార్చి మిగిలినవారితోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారని కేటీఆర్ ఇప్పుడు చెప్పుకొంటున్నారు.
తెలంగాణ ఫలితాలను చూసి పొరుగు రాష్ట్రం ఏపీ సిఎం జగన్ అప్రమత్తమయ్యారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సుమారు 65 మందిని మార్చేస్తున్నారు.
కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలపై పూర్తి నమ్మకం ఉంచి వారితోనే ఎన్నికలకు వెళ్ళి ఓడిపోగా, ఏపీ సిఎం జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలను నమ్మకపోవడం వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లకల్లోల్లంగా మారింది. ఆ పార్టీ అప్పుడే ఓటమికి సిద్దపడిపోయిందనే భావన ఏపీ ప్రజలలో వ్యాపిస్తోంది.