తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో, లోక్‌సభ ఎన్నికలలో గెలవడం అనివార్యమైంది. ఈ ఎన్నికలలో కూడా ఓడిపోతే పార్టీ నేతలకు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం సడలి, బిఆర్ఎస్ పార్టీ చెల్లాచేదురయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక బీజేపీతో పొత్తు కోసం బిఆర్ఎస్ తెర వెనక ప్రయత్నాలు చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అయితే ఇప్పటికైనా ఆ రెండు పార్టీలు ధైర్యంగా పొత్తులు పెట్టుకొని వస్తే వాటి నిజరూపాలు ప్రజలకు కూడా అర్దమవుతుందని, కానీ అవి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయవచ్చని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఊహాగానమని కొట్టిపడేయలేము. ఎందుకంటే, బిఆర్ఎస్ పార్టీకి ఓపక్క కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, మరోపక్క మోడీ ప్రభుత్వం నుంచి ప్రమాదం పొంచి ఉంది. కనుక రెంటినీ ఎదుర్కొంటూ మనుగడ సాధించడం చాలా కష్టం. కనుక బీజేపీతో దోస్తీ కోసం బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుండవచ్చు.
ఈ విషయం రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావువంటివారికి కూడా తెలుసు కానీ వారు కానీ కేసీఆర్‌తో దోస్తీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో దోస్తీ చేస్తే మళ్ళీ ఆయనే బలపడతారు తప్ప తెలంగాణ బీజేపీ కాదని నచ్చజెపుతున్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న ఈ సమయంలోనే దానిని నిర్వీర్యం చేసి బీజేపీ బలపడవచ్చని వారు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య మొదలైన ఈ మూడు స్తంభాలట ఏవిదంగా సాగుతుందో లోక్‌సభ ఎన్నికల గంట మ్రోగేలోగా తెలియవచ్చు.