తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ పాల్గొని అనేక అంశాలపై తన అభిప్రాయాలను, వాదనలను, నిర్ణయాలను తెలియజేశారు.
తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడుతూ, “నేను ఫిరాయింపులను ప్రోత్సహించను. కేసీఆర్ కూడా విజ్ఞతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ కేసీఆర్ అటువంటి ప్రయత్నాలు చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము,” అని స్పష్టంగా చెప్పారు.
అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసి తన ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే, తాము కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆకర్షించి తుడిచిపెట్టేస్తామని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన్నట్లే భావించవచ్చు.
లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుకోకపోతే కేసీఆర్ నాయకత్వంపై సందేహాలు మొదలవుతాయి కనుక ఆయన బీజేపీతో పొత్తులకు ప్రయత్నించవచ్చని, కానీ దాని వలన బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
శాసనసభలో సిఎం కుర్చీలో నేను కూర్చోవడం చూడలేకనే కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారేమో? అని రేవంత్ రెడ్డి వ్యంగంగా అన్నారు. కేసీఆర్‌లాగ అహంభావం ప్రదర్శించకుండా అందరినీ కలుపుకుపోతూ పనిచేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రగతి భవన్‌లోనికి ఎవరూ ప్రవేశించకుండా కేసీఆర్ ఇనుప కంచెలు ఏర్పాటుచేసుకొని తలుపులు మూసుకొని కూర్చోనేవారని, కానీ తమ ప్రభుత్వం తలుపులు అందరికీ ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఫార్మా సిటీ విషయంలో వారి సలహాలు అడిగి తెలుసుకున్నానని చెప్పారు.
వందల ఎకరాలున్న భూస్వాములను, సాగుచేయని బంజరు భూములకు రైతుబంధు పొందుతున్నవారిని తొలగించి, ఈ సాయం నిజంగా అవసరమున్న చిన్న, సన్నకారు రైతులకు సాయపడటమే తమ ప్రభుత్వ విధానమని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.