ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొటాబోటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినందున ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునేందుకు బిఆర్ఎస్ లేదా బీజేపీ ఎమ్మెల్యేలకు గాలం వేయక తప్పదు.
ఇదే బలహీనత కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, మళ్ళీ అధికారం చేపట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేయక మానదు.
ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. ఈ విషయం రెండు పార్టీలకు బాగా తెలుసు కనుక తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టే ఉంటాయి. బహుశః ఈ ప్రయత్నాలలో భాగంగానే కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్న ట్లున్నారు. బిఆర్ఎస్ పార్టీ కూడా ఇంచుమించు ఇదేవిధంగా చెప్పుకుంటోంది.
మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిన్న కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మాకు కేసీఆర్ గురువు, దైవ సమానులు. మా పార్టీలో అందరికీ ఆయన మాటే వేదవాక్కు. కనుక ఆయనను కాదని మా పార్టీలో ఎవరూ బయటకు వెళ్ళరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో నుంచి ఒకరిని తీసుకువెళితే, అందుకు బదులుగా కాంగ్రెస్ వాళ్ళు పది మంది మా పార్టీలోకి వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. ఏదో రోజు వారంతట వారే తమ ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు. మా పార్టీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేసేందుకు సిద్దంగా ఉన్నారు,” అని అన్నారు.
కనుక ముందుగా ఏ పార్టీ ఎమ్మెల్యేలను ఏ పార్టీ గాలం వేసి లాగేస్తుందో చూడాలి.