ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ వచ్చి మాజీ సిఎం కేసీఆర్‌ని పరామర్శించడంపై అప్పుడే రాజకీయ వ్యాఖ్యలు మొదలయ్యాయి.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ, “జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో చిచ్చు గురించి మాట్లాడి తన ఓటమిని ముందే ఒప్పుకున్నారు. నిజానికి ఆయనే తల్లిని, చెల్లిని బయటకు పంపించేశారు.
ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోతామనే భయం మొదలైంది. ఆ భయంతోనే పార్టీలో కూడా ఇప్పుడు స్వయంగా చిచ్చు పెట్టుకొంటున్నారు. ఆ భయంతోనే మళ్ళీ కేసీఆర్ సాయం కోరేందుకు వచ్చారు.
నాగార్జున సాగర్ డ్యామ్ డ్రామాతో కేసీఆర్‌ని గెలిపించాలని జగన్ విఫలయత్నం చేశారు. జగన్‌లో మొదటిసారిగా ఓటమి భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆయనను కేసీఆర్ కూడా కాపాడలేరిప్పుడు.
టిడిపి, జనసేనలు రెండూ బీజేపీని నమ్ముకుంటే పొత్తు పేరుతో వాటినీ అది ముంచేస్తుంది. కనుక బీజేపీకి దూరంగా ఉంటే వామపక్షాలు వాటితో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాయి. ఇకనైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ భయం, బీజేపీ మాయలో నుంచి బయటపడితే మంచిది,” అని అన్నారు.