మహాలక్ష్మి పింఛన్ పధకానికి సన్నాహాలు షురూ

January 04, 2024


img

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి పధకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పధకాలకు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి కనుక ఆలోగా ఈ హామీని అమలుచేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది.

సిఎం రేవంత్‌ రెడ్డి ఈ పధకం అమలు గురించి ఇప్పటికే ఆర్ధికశాఖ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఈ పధకాన్ని వర్తింపజేస్తే నెలకు రూ.750 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని వారు ఆయనకు వివరించారు. లబ్ధిదారుల సంఖ్య మరో 10,20,30 లక్షలు పెరిగితే ఏ మేరకు ప్రభుత్వంపై భారం పడుతుందో అధికారులు సిఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు.

కనుక ముందుగా 30 లక్షల మందికి ఈ పధకాన్ని వర్తింపజేసేందుకు ఆర్ధికశాఖ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్రమంగా ఆదాయం సమకూర్చుకొని మరింత మందికి ఈ పధకాన్ని వర్తింపజేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆరు గ్యారెంటీలను అమలు కోసం ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికలలోగా హామీలను అమలుచేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ప్రచారం చేయకుండా ఉండదు.

ఇదీగాక లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే రాష్ట్రంలో ఎన్నికల కొడంగల్‌కు అమలులోకి వస్తుంది. అప్పుడు కొత్త పధకాలను అమలుచేయలేదు. కానీ అదే ఎన్నికల కోడ్ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఓవిదంగా వరమని కూడా చెప్పవచ్చు.

కోడ్ వలన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పధకాలను అమలుచేసేందుకు మరో 2-3 నెలల అదనపు గడువు లభిస్తుంది. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ని సాకుగా చూపి బిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే అవకాశం కూడా ఉంది. 


Related Post