ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో ఆయన నివాసంలో భేటీ కాబోతున్నారు. ఇటీవల కేఆర్ తన ఫామ్‌హౌస్‌లో కాలు జారిపడినప్పుడు తుంటి ఎముక విరగడంతో యశోదా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకొన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎవరూ పరామర్శకు రావద్దని, వస్తే ఆస్పత్రిలో ఇతర రోగులకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తాయని కేసీఆర్ స్వయంగా విజ్ఞప్తి చేశారు. కనుక జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించేందుకు రాలేదు. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొంటున్నందున జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ వచ్చి ఆయనను పరామర్శించనున్నారు.
త్వరలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున ఇది కేవలం పరామర్శకే అని అనుకోలేము. ఇంతకాలం తెలంగాణలో రాజకీయాలు చేసిన ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు.
తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకుండా తప్పుకొని కాంగ్రెస్ గెలుపుకి పరోక్షంగా సహకరించినందున, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్న వైఎస్ షర్మిల ద్వారా టిడిపికి కాంగ్రెస్ సాయపడవచ్చు.
ఏపీలో వైఎస్ షర్మిల రాజకీయాలు చేయడమే జగన్మోహన్ రెడ్డికి వైసీపికి చాలా ఇబ్బందికరం అనుకొంటే, ఆమె తమ విరోధులైన టిడిపి, జనసేనలతో పొత్తులు పెట్టుకొంటే ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఈసారి ఎన్నికలలో వైసీపికి ఎదురుగాలి వీస్తోంది. కనుక రాజకీయ సలహాలు, సహాయం కోసమే పరామర్శ పేరుతో కేసీఆర్‌తో జగన్, భేటీ కాబోతున్నట్లు భావించవచ్చు.