వైఎస్ షర్మిల అన్నతో ఆస్తులు, పదవుల విషయంలో గొడవపడి తెలంగాణకు వచ్చి తల్లి విజయమ్మతో కలిసి సొంత కుంపటి పెట్టుకోవడం, సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ కుంపటి అడ్రస్ లేకుండా పోవడం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నావల్లే గెలిచిందని ఆమె గొప్పలు చెప్పుకుంటున్నారు.
వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో మా పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకోవడం వలననే కాంగ్రెస్ గెలవగలిగింది. ఒకవేళ మేము ఎన్నికలలో పోటీ చేసి ఉంటే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేదే కాదు. అప్పుడే నన్ను కాంగ్రెస్‌లో చేరమని అడిగితే అందుకు నేను ఒప్పుకున్నాను. బుధవారం ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయిన తర్వాత అన్ని వివరాలు చెపుతాను,” అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల అవసరమేలేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆనాడే నిష్కర్షగా చెప్పారు. ఒకవేళ ఆమెను చేర్చుకుంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని గట్టిగా చెప్పడంతో అందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించి, ఎన్నికల సమయంలో ఆమెను దూరంగా పెట్టింది.
దాంతో ఆమె తమ పార్టీ రాష్ట్రంలో 117 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించేశారు. కానీ అప్పటికే పార్టీ ఖాళీ అయిపోయింది. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఎవరూ లేకపోవడంతో ఆమె కూడా పోటీ నుంచి విరమించుకొని, వేరే గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోసమే తాను త్యాగం చేశానని, తన వల్లే కాంగ్రెస్ గెలిచిందని వైఎస్ షర్మిల గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ చేసిన కృషి ఏమీ లేదన్నమాట!