కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజిలో కొంత భాగం క్రుంగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపించబోతోంది. అయితే దీనిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించకుండా న్యాయ విచారణతో ఎందుకు సరిపెడుతోంది?అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా ఉండాలంటే బిఆర్ఎస్ పార్టీ మద్దతు అవసరం కనుకనే రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించడంలేదని ఆరోపించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే మూడు రోజులలోగా విచారణ మొదలుపెట్టించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. కానీ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందున ఒకదానిని మరొకటి కాపాడుకొంటున్నాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవంటూనే కేంద్ర ప్రభుత్వం దానికి దొడ్డిదారిలో రుణాలు ఇప్పించింది. కేసీఆర్ కోసం నియమనిబందనలన్నీ పక్కన పెట్టి అన్నివిదాల ఆయనకు సహకరించింది. మేడిగడ్డ బ్యారేజి క్రుంగితే ఇంతవరకు కేసీఆర్ మాట్లాడలేదు. ఆయనని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు?
ఇంతవరకు కిషన్ రెడ్డి క్రుంగిన బ్యారేజిని పరిశీలించేందుకు ఎందుకు రాలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం వంటిదని మోడీ, అమిత్ షాలే ఆరోపించారు కదా మరి ఆయనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదు?ఎందుకంటే కేసీఆర్‌ని అవినీతి కేసుల నుంచి కాపాడటానికే కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారు.
కేసీఆర్ కోరడంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధుల మీదకి ఈడీని పంపించిన కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని ఎందుకు ఉపేక్షిస్తోంది? బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రెండూ ఈ అవినీతిలో భాగమే.
అయినా మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులైనా కాకముందే మాపై ఇటువంటి ఆరోపణలు చేస్తుండటం చాలా దారుణం. త్వరలోనే సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో విచారణలో తేలుతుంది. దోషులెవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.