తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదని, లక్షల కోట్లు అప్పులు పేరుకుపోయి ఉన్నాయని తెలియజేస్తూ శ్వేతపత్రాలు విడుదల చేసింది. మంత్రులు మేడిగడ్డ బ్యారేజి, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులని సందర్శించి వాటిలో లోపాల గురించి మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టుని కూడా మార్చాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ నేపధ్యంలో వీటన్నిటి పరిస్థితి ఏమిటి? అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సిఎం రేవంత్ రెడ్డి సమాధానాలు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా నిన్న సచివాలయంలో వారితో మాట్లాడుతూ, “మేము వేటినీ నిలిపివేయడం లేదు. ప్రతీ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి, ప్రజలకు మరింత మేలు చేకూరాలనేదే మా కోరిక.
• హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టి మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ ఆ తర్వాత రామచంద్రాపురం వరకు పొడిగిస్తాం.
• నాగోల్ నుంచి ఎల్బీ నగర్-ఓవైసీ ఆస్పత్రి-ఫలక్‌నుమా మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగిస్తాం. మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం.
• బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా లక్డీకపూల్ వరకు మరో మెట్రో లైన్ నిర్మిస్తాం. ఈవిధంగా నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ప్రజలకు మంచి ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. ఇలా చేస్తే కేంద్రం కూడా వీటికి నిధులు ఇస్తుంది.
• గత ప్రభుత్వం ఒకేచోట 25 వేల ఎకరాలలో ఫార్మా సిటీ నిర్మించాలనుకొంది. అలా చేస్తే శంషాబాద్ విమానాశ్రయంపై ఆ ప్రభావం పడి న్యూయార్క్ విమానాశ్రయంలా పనికి రాకుండా పోతుంది. కనుక ఒకటికి బదులు పది చిన్న చిన్న ఫార్మా విలేజీలు ఏర్పాటు చేస్తాం. అవుటర్ రింగ్ రోడ్డు-రీజినల్ రింగ్ రోడ్డు మద్య ఒక్కోటి 1,000-3,000 ఎకరాలలో ఒక్కో దానిలో కేవలం 10 ఫార్మా పరిశ్రమలు ఉండేలా వీటిని ఏర్పాటుచేస్తాం. తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది అని చెప్పారు.