తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శనివారం కొత్తగూడెం జిల్లా, మణుగూరులోని భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయనకు ప్లాంట్ గురించి వివరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత ప్రభుత్వం ఈ ప్లాంట్ నిర్మించాలని అనుకున్నప్పుడే కాలం చెల్లిన ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీ’ వద్దని, అందుబాటులోకి వచ్చిన ‘సూపర్ క్రిటికల్ టెక్నాలజీ’తో ప్లాంట్స్ నిర్మించుకోమని కేంద్రం చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా అదే చెప్పాము. కానీ కేసీఆర్ ఎవరి మాట వినకుండా దీని నిర్మాణం ప్రారంభించేశారు.
పాత టెక్నాలజీ కారణంగా ప్లాంట్ నిర్మాణ, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ప్లాంట్‌కి అవసరమైన బొగ్గుకి కూడా చాలా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్లాంట్ వలన పర్యావరణం కూడా కాలుష్యమవుతోంది. కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలు తెలంగాణకు శాపంగా మారాయి. ఆయన విచ్చలవిడిగా చేసిన అప్పుల వలన భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టేసిన్నట్లవుతోంది,” అని భట్టి విక్రమార్క అన్నారు.