రేవంత్‌ మాట నిలబెట్టుకొన్నారు... కానీ అది పరిష్కారం కాదుగా?

December 31, 2023


img

తెలంగాణలో మహాలక్ష్మి పధకం ప్రారంభించినప్పటి నుంచి మహిళలందరూ బస్సులలోనే ఉచితంగా ప్రయాణిస్తుండటంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సులను అడ్డుకొని నిరసనలు తెలియజేస్తున్నారు.

వారి సమస్యలు సిఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి రావడంతో గత శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారి ప్రతినిధులు (గిగ్ వర్కర్లు)తో సమావేశమయ్యారు. వారితో పాటు ఫుడ్ డెలివరీ బాయ్స్ ప్రతినిధులు కూడా హాజరయ్యి తమ సమస్యలను చెప్పుకోగా సిఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

వారందరికీ రూ.5 లక్షల ప్రమాద భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకం కింద రూ.10 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే శనివారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. 

గిగ్ వర్కర్లు తమ జీవనోపాధి కోసం నిత్యం రోడ్లపై తిరుగుతుంటారు కనుక వారికి ప్రమాద భీమా, ఆరోగ్యశ్రీని వర్తింపజేయడం మంచి ఆలోచనే. కానీ మహాలక్ష్మి పధకం వలన ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ఇవి పరిష్కారం కాదు కదా? కనుక వారి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం సరైన ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంటుంది లేకుంటే వారు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. దాని వలన ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది కూడా!


Related Post