తెలంగాణలో సాగు, త్రాగునీరు, వ్యవసాయ రంగ రూపురేఖలను సమూలంగా మార్చేసిన ప్రాజెక్ట్ ఏది? అని ప్రశ్నిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పుకోక తప్పదు. మాజీ సిఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రత్యేక శ్రద్దతో ఈ ప్రాజెక్టుని నిర్మింపజేశారు.
మాజీ సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు కూడా రేయింబవళ్ళు ప్రాజెక్టు నిర్మాణపనులను పర్యవేక్షిస్తూ కేవలం మూడున్నరేళ్ళలో పూర్తి చేయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు పారడం మొదలుపెట్టిన తర్వాతే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యింది. చివరికి హైదరాబాద్ నగరానికి కూడా త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించింది.
ఇంత గొప్ప ప్రాజెక్టులో మొట్ట మొదటిదైన మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగిపోవడం, అన్నారం బ్యారేజీలో గోడలకు పగుళ్ళు ఏర్పడి నీళ్ళు కారిపోతుండటం, ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో రెండో కోణం బయటపడుతోంది.
సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టులో మూడేళ్ళు గడవక మునుపే అప్పుడే ఇటువంటి సమస్యలు తలెత్తడంతో కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్, హరీష్ రావుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
మేడిగడ్డ బ్యారేజిలో మూడు పియర్స్ తొలగించక తప్పదని ఈఎన్‌సి మురళీధర్ తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాము ఆనాడే తుమ్మిడిహెట్టి వద్ద తక్కువ ఖర్చుతో బ్యారేజ్ నిర్మిస్తే సరిపోతుందని చెప్పామని కానీ కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారిందని వాదిస్తున్నారు.
కానీ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపయోగాలు, మేడిగడ్డ వద్దనే ఎందుకు బ్యారేజి నిర్మించాల్సి వచ్చింది? అలాగే కాంగ్రెస్ మంత్రులు గొప్పగా చెప్పుకొంటున్న ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం వలన ఎటువంటి సమస్యలు వస్తాయనే పూర్తి వివరాలతో ఓ వీడియోని మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై తెలంగాణలో ప్రతీ ఒక్కరూ స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.