తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన కాంగ్రెస్ సీనియర్ నేతలలో మధు యాష్కీ కూడా ఒకరు. కాంగ్రెస్ ప్రభంజనంలో ఆయన గెలిచి ఉంటే ముఖ్యమంత్రి కాకపోయినా మంత్రి పదవి తప్పక లభించి ఉండేది. కానీ ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడమే శాపంగా మారింది.
శాసనసభ ఎన్నికలలో తెలంగాణ అంతటా సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రేటర్ పరిధిలో మాత్రం అన్ని స్థానాలలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలా ఓడిపోయినవారిలో మధు యాష్కీ కూడా ఒకరు. గతంలో ఆయన నిజామాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు కనుక త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో ఆయన పోటీ చేస్తారనుకొంటే, తనకు ఆసక్తి లేదని చెప్పేశారు.
ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. బహుశః అందుకేనేమో మంత్రివర్గ విస్తరణపై సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని మధు యాష్కీ అన్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి అటువంటి సంకేతం ఏదీ ఇవ్వలేదు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు రావడంపై మధు యాష్కీ భిన్నంగా స్పందించారు. “ఆయన లోక్‌సభ ఎన్నికలకు బీజేపీకి దిశానిర్దేశం చేసేందుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు దగ్గరవుతున్నాయి. కనుక రాష్ట్ర బీజేపీ నేతలలో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకే వచ్చారని భావిస్తున్నాను.
బీజేపీ, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొంతమంది మా పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్‌లో నాపై విజయం సాధించిన సుధీర్ రెడ్డి, తన అక్రమస్తులను కాపాడుకొనేందుకు ఏ పార్టీలోనైనా చేరేందుకు సిద్దంగా ఉంటారు. కానీ అటువంటి వారిని కాంగ్రెస్‌లో చేర్చుకొంటే మా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావిస్తున్నాను,” అని మధు యాష్కీ గౌడ్ అన్నారు.