పంచాయతీ ఎన్నికలు బిఆర్ఎస్‌కు మరో అవకాశమా... పరీక్షా?

December 28, 2023


img

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు తిరుగులేకుండా పాలించిన బిఆర్ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడం నేటికీ చాలా ఆశ్చర్యమే. ఇదివరకు సింగరేణిలో వరుసగా రెండుసార్లు గెలిచిన దాని అనుబంధ సంఘం టిబిజికెఎస్ కూడా నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో పత్తా లేకుండా పోయింది. తెలంగాణలో ఉనికి కోల్పోయిందనుకొన్న సీపీఐ సింగరేణి ఎన్నికలలో విజయం సాధించింది. 

ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుకోవడానికి పంచాయతీ ఎన్నికల రూపంలో మరో అవకాశం లభించబోతోంది. 

రాష్ట్రంలో పంచాయతీ పాలక మండళ్ళ గడువు 2024, ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తుంది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మూడు నెలల ముందుగానే పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. కానీ శాసనసభ ఎన్నికల వలన ఆలస్యమైంది. 

కనుక తక్షణమే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 30లోగా పంచాయతీ ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు, అధికారుల జాబితాని సమర్పించిన్నట్లయితే వెంటనే వారికి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. కనుక జనవరి నెలాఖరులోగానే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

ఈ ఎన్నికలలో కూడా సత్తా చాటుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. శాసనసభ ఎన్నికల తర్వాత వీటిలో కూడా కాంగ్రెస్‌ గెలిస్తే తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలకు మరింత స్పూర్తి కలిగిస్తుందని భావిస్తోంది. 

అయితే శాసనసభ, సింగరేణి ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ కూడా పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే రెండు నెలల వ్యవధిలో ఇది మూడో ఓటమి అవుతుంది. అప్పుడు ఆ ప్రభావం పార్టీ శ్రేణులపై పడితే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమవుతుంది. కనుక బిఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నించవచ్చు. 


Related Post