పింఛన్ పెంపుకి మళ్ళీ దరఖాస్తులు దేనికి?కవితక్క సందేహం

December 27, 2023


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్ పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. 

రాష్ట్రంలో 44 లక్షల మందికి చాలాకాలంగా పింఛన్లు అందుకుంటున్నారు. వారి పింఛన్ పెంచడానికి మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? వారికిస్తున్న రూ.2,000 పింఛన్‌ని నేరుగా రూ.4,000కి పెంచవచ్చు కదా? కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే జనవరి నుంచే వారందరికీ పింఛన్ పెంచి ఇవ్వాలి. మళ్ళీ దరఖాస్తులంటూ వారిని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదు,” అని అన్నారు. 

“కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహ జ్యోతి పథకంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. కనుక మళ్ళీ దానికీ వేరేగా దరఖాస్తు కోరవలసిన అవసరం ఏమిటి? 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న ప్రజలు బిల్లులు కట్టవలసిన అవసరమే లేదు. కనుక ప్రజలే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఒకవేళ బిల్లు ఎందుకు చెల్లించలేదని అడిగితే కాంగ్రెస్‌ హామీని గుర్తుచేస్తే సరిపోతుంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.          

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని, చేశామని చెప్పింది. కానీ ఇంతవరకు రైతుల ఖాతాలలో ఆ డబ్బు ఎందుకు జమా కాలేదు? రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగ యువతీ యువకుడికి నెలకు రూ.4,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజావాణి దరఖాస్తులలో ఆ ప్రస్తావనే లేదు. ఎందువల్ల?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పధకాలకు తెల్ల రేషన్ కార్డులకు ముడిపెట్టి తప్పించుకోవాలని చూస్తోంది. తెల్ల రేషన్ కార్డులు లేనివారి పరిస్థితి ఏమిటి? వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తుందా లేదా? ఎప్పటిలోగా ఇస్తుందో చెప్పాలి,” అని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.


Related Post