తెలంగాణ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలు దాని మెడకు గుదిబండగా చుట్టుకొంటాయని అందరూ ఊహించిందే. ఇప్పుడు అదే జరుగబోతోంది. ఇప్పటికే మహాలక్ష్మి పధకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా టిఎస్‌ఆర్టీసీ భారీగా నష్టపోతోంది.
మిగిలిన హామీల అమలు చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కనుక వీటన్నిటికీ తెల్ల రేషన్ కార్డులతో ముడిపెడుతోంది. కానీ తెలంగాణాలో తెల్ల రేషన్ కార్డులున్న వారు కూడా లక్షల్లో ఉన్నారు. కనుక కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం నిలిపి వేసి ఉన్నవాటిని కూడా కత్తిరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలను రూపొందిస్తున్నాము. రాష్ట్రంలో అవసరం లేని చాలా మందికి తెల్ల రేషన్ కార్డులున్నట్లు, నిజంగా వాటి అవసరం ఉన్నవారికి లేన్నట్లు గుర్తించాము. తెల్ల రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నట్లు గుర్తించాము. కనుక అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఈ తెల్ల రేషన్ కార్డులు ఏవిదంగా అందించాలనే దానిపై చర్చిస్తున్నాము. త్వరలోనే దీనికి సంబందించి నియమనిబంధనలు ప్రకటిస్తాము,” అని చెప్పారు.