తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. విభజన హామీలు అమలు, రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసి తమ ప్రభుత్వానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశామని భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు.
అయితే మోడీ, అమిత్ షాలు వారి బీజేపీ కాంగ్రెస్ పార్టీని రాజకీయ శత్రువుగా భావిస్తూ కాంగ్రెస్‌తో యుద్ధం చేస్తున్నప్పుడు, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శిస్తున్నప్పుడు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మోడీ తోడ్పడతారా?అంటే కాదనే అర్దమవుతోంది.
నిజానికి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనే కాంగ్రెస్ గెలవకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్ధుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులు చేయించారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకే జనసేనతో పొత్తు పెట్టుకొని ఆ సీట్లు బిఆర్ఎస్ పార్టీకి దక్కేలా చేశారు.
ఒకవేళ ఈ రాజకీయాలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తే మంచిపేరు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకే వస్తుంది తప్ప మోడీకి లేదా బీజేపీకి రాదు కదా?త్వరలో లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. అప్పుడు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు మళ్ళీ ఒక్కటయ్యి కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రయత్నించకుండా ఉండవు.
కనుక రేవంత్, భట్టి విక్రమార్క అడగడం, అందుకు ప్రధాని మోడీ ‘సరే’ అని తల ఊపడం కేవలం మర్యాద కోసమే తప్ప ఈ భేటీతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.