మంత్రుల మేడిగడ్డ పర్యటన... అందుకేనా?

December 26, 2023


img

తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం మేడిగడ్డ బ్యారేజిలో క్రుంగిన భాగాన్ని పరిశీలించనున్నారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు వారికి మేడిగడ్డ బ్యారేజి మరమత్తులు చేపట్టేందుకు తీసుకోవలసిన చర్యలు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు, విద్యుత్ వినియోగం, ప్రాణహిత ప్రాజెక్టు గురించి వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు. ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకొన్న ఎల్ & టితో సహా మిగిలిన గుత్తేదారు కంపెనీల ప్రతినిధులు కూడా హాజరయ్యి మంత్రుల సందేహాలకు సమాధానాలు చెప్తారు. 

కేసీఆర్‌ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని భారీగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పదేపదే ఆరోపించేవారు. కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకొన్న ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజిలో కొన్ని పిల్లర్లు క్రుంగటంతో దీనిపై రాజకీయాలు మొదలయ్యాయి.

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మేడిగడ్డ బ్యారేజి సాక్షిగా బిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వేరే చెప్పక్కరలేదు. 

ఇదీగాక క్రుంగిన పిల్లర్లకు మరమత్తులు చేసేందుకు అయ్యే భారీ ఖర్చుని ప్రభుత్వం భరించాలా లేక ఎల్&టి కంపెనీ భరించలా?అనే మరో వివాదం కూడా నెలకొంది. మరమత్తులకు ప్రభుత్వమే సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఎల్&టి కంపెనీ లేఖ వ్రాయడంతో అదీ మరో వివాదంగా మారింది.

ఇక మేడిగడ్డ పిల్లర్లు మరమత్తులు చేపట్టేందుకు బ్యారేజీలో నీటిని మొత్తం ఖాళీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పిన్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఈ యాసంగిలో మేడిగడ్డ పరిధిలో రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు రావచ్చు. 

కనుక ఇరువురు మంత్రులు ఈ సమస్యలన్నిటిపై అక్కడే అధికారులు, గుత్తేదారులతో సమీక్ష జరుపుతారు. అనంతరం వారు అక్కడే మీడియాతో మాట్లాడుతారు. తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డితో వారు సమావేశమై దీనిపై చర్చిస్తారు.


Related Post