కేసులు తప్పవని బిఆర్ఎస్ గ్రహించిందా?

December 25, 2023


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆదివారం తెలంగాణ భవన్‌లో ‘స్వేద పత్రం’ పేరుతో తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేశాము. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేత పత్రాలతో పేరుతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. అప్పులు, అవినీతి అంటూ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద జల్లుతోంది. న్యాయ విచారణ జరిపిస్తామని బెదిరిస్తోంది. అయితే మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృధ్ది చేశాము తప్ప ఏ తప్పు చేయలేదు. అందుకే న్యాయ విచారణ జరిపించుకోమని సవాలు విసిరాము. మేము ఏ విచారణకైనా సిద్దమే. 

మాపై రాజకీయ కక్ష సాధించాలనుకొంటే చేసుకోండి కానీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయవద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాళేశ్వరం వంటి అతి పెద్ద ప్రాజెక్టులో ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండవచ్చు. మేడిగడ్డ బ్యారేజిలో కొంత భాగం క్రుంగితే దానిని సరిచేయాలి కానీ న్యాయవిచారణ పేరుతో మాపై రాజకీయకక్ష సాధింపులకు పాల్పడాలని ఆలోచించడం సరికాదు,” అన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తోంది? అనే ప్రశ్నకు కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ వేర్వేరు సమాధానాలు చెపుతున్నాయి. 

కాంగ్రెస్‌: తెలంగాణ అభివృద్ధి పేరుతో కేసీఆర్‌, ఆయన కుటుంబం భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకొని అప్పులపాలు చేసింది. కనుక బిఆర్ఎస్‌ నేతలు చెప్పుకొంటున్నట్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ గొప్పగా లేదు.

బిఆర్ఎస్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకొనేందుకే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అబద్దాలు చెపుతోంది. బిఆర్ఎస్‌ నేతలపై రాజకీయ కక్ష సాధించడం కోసమే శ్వేతపత్రాల పేరుతో ఆరోపణలు చేస్తూ రంగం సిద్దం చేస్తోంది. అందుకే న్యాయవిచారణల పేరుతో బెదిరిస్తోంది. 

బిఆర్ఎస్‌ వాదనలలో అభివృద్ధి వాస్తవమే. కాంగ్రెస్‌ వాదనలలో అప్పులు, అవినీతి వాస్తవమే. కనుక తాము కేసులలో చిక్కుకోబోతున్నామని గ్రహించిన బిఆర్ఎస్‌, అందుకు ముందే సిద్దమయ్యి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నట్లు అర్దమవుతోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్‌ని వేలెత్తి చూపడమంటే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన్నట్లే అని వాదిస్తూండేది. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా బిఆర్ఎస్‌ అదేవిదంగా వాదిస్తుండటమే విశేషం.


Related Post