ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఈరోజు మధ్యాహ్నం నారా లోకేష్‌తో కలిసి హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొని ఇద్దరూ కలిసి ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడంతో అధికార వైసీపిలో కలకలం మొదలైంది.
ఆయన చెందిన ఐప్యాక్ గత ఎన్నికలలో వైసీపి కోసం పనిచేసి గెలిపించింది. రాబోయే ఎన్నికలలో కూడా వైసీపి కోసం పనిచేస్తోంది. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ హటాత్తుగా నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు నాయుడుతో సమావేశం అవడం అధికార వైసీపికి పెద్ద షాక్ అనే చెప్పాలి.
అంటే తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమిని ఊహించి చెప్పిన్నట్లే, త్వరలో జరుగబోయే ఏపీ ఎన్నికలలో వైసీపి ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ భావించడం వలననే చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు వచ్చారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.
కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ జాతీయ మీడియా చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలాగ అప్పులు చేస్తూ సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచుకొంటూ పోతే దేశం దివాళా తీస్తుంది,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన ఆ గొప్ప అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా పేరు పాడుచేసుకొంటున్నారు” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక రాబోయే ఎన్నికలలో టిడిపి కోసం పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్దం అవుతున్నారా?నేడో రేపో తప్పక తెలుస్తుంది.