తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న మహాలక్ష్మి పధకానికి ఊహించిన్నట్లే రాష్ట్రంలో మహిళల నుంచి విశేషాదరణ వస్తోంది. దీంతో నేరుగా ప్రతీరోజూ మహిళలు లబ్ధి పొందుతున్నారు కనుక ఈ ఒక్క పధకంతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంచి పేరు లభిస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా మూడు వారాలు కాలేదు. ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రజాభిమానం కూడగట్టుకోవడం చాలా గొప్ప విషయమే. ముఖ్యంగా అప్పుడే బిఆర్ఎస్ పాలనను మరిపించే ప్రయత్నం జరుగుతుండటంతో ఆ పార్టీ కూడా అప్రమత్తమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకంతో మంచిపేరు సంపాదించుకొంటుంటే, బిఆర్ఎస్ పార్టీ ఆ పధకం వలన నష్టపోతున్న ఆటో, షేరింగ్ ఆటో, షేరింగ్ వ్యాన్, క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది.
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు పార్టీలో ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వారు ఆటో డ్రైవర్లు తదితరులతో సమావేశమయ్యి మహాలక్ష్మి పధకం ద్వారా వారు ఏవిదంగా, ఎంత మేర నష్టపోతున్నారో తెలుసుకొని కేసీఆర్‌కి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం మొదలుపెట్టాలని బిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకాన్ని ఆపలేదు కుదించలేదు. కష్టమైనా నష్టమైనా దానిని కొనసాగించాల్సిందే. కానీ ఇప్పుడు బిఆర్ఎస్ ఒత్తిడి పెరిగితే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉపశమనం కలిగించేందుకు ఏదో ఒకటి చేయకతప్పదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారే అవకాశం ఉంది.