ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదట 153 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్దగా మార్చకుండానే శాసనసభ ఎన్నికలకు వెళ్ళాలనుకొన్నారు. కానీ వారిలో 40-50 మంది పనితీరు బాగోలేదని తప్పనిసరిగా మార్చడం మంచిదని ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐ-ప్యాక్ బృందం పదేపదే హెచ్చరిస్తూనే ఉంది.
దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని లేకుంటే పక్కనపెట్టేస్తానని హెచ్చరించారు. చివరికి వారిలో ఓ 10-12 మందిని మార్చితే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి అనుకొంటున్నప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆయనకు పెద్ద షాక్ ఇచ్చాయి.
కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్దగా మార్చకుండా ఎన్నికలకు వెళ్ళి ఓడిపోవడంతో జగన్ అప్రమత్తమయ్యారు. తన 153 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 65 మందిని మార్చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 14 నియోజకవర్గాల ఇన్‌చార్జిలని మార్చేశారు.
అయితే ఎన్నికలకు ముందు ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వలననే వైసీపి మరింత నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. టికెట్లు లభించనివారు పార్టీని వీడినా లేదా కలిసికట్టుగా తిరుగుబాటు చేసినా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటుంది.
వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సివస్తున్న ఎమ్మెల్యేలకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేదా టికెట్ ఆశిస్తున్నవారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి ఉంటుంది కనుక వారు కూడా ఎన్నికలలో ఓడిపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక జగన్, కేసీఆర్ నుంచి గుణపాఠం నేర్చుకొంటున్నారా లేక ఆయన చేయని తప్పుని చేస్తూ చేజేతులా ముప్పు తెచ్చుకొంటున్నారా? అనే సందేహం కలుగుతోంది.