బిఆర్ఎస్‌తో మజ్లీస్‌ దోస్తీ ఇంకా అవసరమా? రేవంత్‌

December 22, 2023


img

తెలంగాణ శాసనసభలో గురువారం విద్యుత్ రంగంపై చర్చ జరిగినప్పుడు మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు.

పాతబస్తీలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్లు, కొత్త కరెంట్ స్తంభాలు, కరెంట్ వైర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్‌ రెడ్డి పార్టీలు ఫిరాయిస్తూ చివరికి కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.

పాతబస్తీలో విద్యుత్ చౌర్యం గురించి మాజీ సిఎం కేసీఆర్‌ ఇదే సభలో వివరణ ఇచ్చిన సంగతిని ఒవైసీ మరోసారి గుర్తుచేశారు. మజ్లీస్‌ పార్టీ దేనికీ బీ-టీం కాదని, జూబ్లీహిల్స్‌లో మజ్లీస్‌కు కార్పొరేటర్లు ఉన్నందునే పోటీ చేసిందని చెప్పారు.      

సిఎం రేవంత్‌ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీకి సూటిగా కొన్ని ప్రశ్నలు, ఘాటుగా చురకలు కూడా వేశారు. 

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించని నియోజకవర్గాలలో మొదటి స్థానంలో సిద్ధిపేట (61.37%), గజ్వేల్ (50.29%), మూడో స్థానంలో పాత బస్తీ (43%) ఉన్నాయి. ఎందుకు? ఈ మూడు నియోజకవర్గాల విద్యుత్ ఛార్జీల బకాయిల చెల్లింపులకి హరీష్ రావు, కేటీఆర్‌, అక్బరుద్దీన్ ముగ్గురూ బాధ్యత తీసుకోవాలి. 

బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను మీరు గుడ్డిగా సమర్ధిస్తున్నారు. ఇది సరికాదు. బిఆర్ఎస్ పార్టీ మీతో దోస్తీ చేస్తూనే అటు బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని రుజువైంది కదా?అందుకే ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి అక్కడ కూర్చోబెట్టారు. బిఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తే ఏమవుతుందో మీరు కూడా గ్రహిస్తే మంచిది. 

మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్న మీరు ఎన్నికలలో ఏం చేశారు. మా పార్టీ మైనార్టీ వర్గానికి చెందిన మహమ్మద్ అజరుద్దీన్, షబ్బీర్ అలీలకు టికెట్లు ఇస్తే మీరు బిఆర్ఎస్ పార్టీ కోసం అక్కడ మీ అభ్యర్ధులను బరిలో దించి ఓట్లు చీల్చి వారిద్దరినీ ఓడగొట్టారు. 

అయినా మేము మిమ్మల్ని ప్రోటెం స్పీకర్‌గా నియమించి గౌరవించాము. మీ సీనియారిటీని మేము గౌరవించినప్పుడు, మీరు కూడా సభలో మొదటిసారిగా అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను గౌరవిస్తే బాగుంటుంది. మొదటిసారి శాసనసభ్యుడుగా ఎన్నికైన వారు మిమ్మల్ని ప్రశ్నించకూడదంటే ఎలా? 

మీరు మజ్లీస్‌ శాసనసభా పక్షనేత మాత్రమే తప్ప రాష్ట్రంలో ముస్లింలందరికీ ప్రతినిధి కారని గ్రహిస్తే బాగుటుంది. మీకు పాతబస్తీ సమస్యల పరిష్కారంపై ఎంత చిత్తశుద్ధి ఉందో మా ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువే బాధ్యత ఉంది. అందుకే మేము బాధ్యతలు చేపట్టగానే మిమ్మల్ని, మీ మజ్లీస్‌ ఎమ్మెల్యేలను సచివాలయానికి ఆహ్వానించి సమస్యలపై చర్చించామని అప్పుడే మరిచిపోతే ఎలా?అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి చురకలు వేశారు.


Related Post