సిఎం రేవంత్ రెడ్డిని మాజె సిఎం కేసీఆర్ తక్కువ అంచనా వేశారా? అంటే అవుననే అనిపిస్తోంది. అధికారంలో లేకపోయినా పదవుల కోసం కీచులాడుకొంటున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిని నాయకుడుగా అంగీకరించారని, వారు ఆయనకు సహకరించారని అందరూ భావించారు. బహుశః కేసీఆర్ కూడా అదే భావించారేమో?నిజంగా అదే జరిగింది కూడా!
అయినప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నడిపించడమే కాదు... ఎన్నికలలో కేసీఆర్‌ని ఓడించి ఇంటికి పంపించారు కూడా. అయినా కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ నేతలు సిఎం రేవంత్ రెడ్డిని ఇంకా తక్కువ అంచనయే వేశారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడిపోతుందని మాట్లాడుతున్నారనుకోవచ్చు.
అయితే పడిపోయేది... రేవంత్ ప్రభుత్వం కాదు! రేవంత్ రెడ్డి దెబ్బకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ గూటికి వచ్చేసే సూచనలు కనిపిస్తున్నాయి!
కానీ దాని కోసం రేవంత్ రెడ్డి తొందరపడటం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి... బిఆర్ఎస్ పార్టీలో ప్రతీ ఒక్కరి మెడకు ఉచ్చు బిగించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్దం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే తెలంగాణ అప్పులు, వివిద శాఖల అప్పులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని భావించవచ్చు.
ఈ ఉచ్చులో ముందుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చిక్కుకొన్నారు. ఈరోజు శాసనసభ సమావేశాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి ప్రాజెక్టులో జగదీష్ రెడ్డి రూ.10 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించినప్పుడు, ఆయన వెంటనే స్పందిస్తూ కావాలంటే న్యాయ విచారణ జరిపించుకోమని సవాలు విసిరారు.
సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి అభీష్టం మేరకు మూడు ప్రాజెక్టులపై జ్యూడీషియల్ ఇన్‌క్వైరీకి ఆదేశిస్తున్నట్లు వెంటనే ప్రకటించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్ళు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్మాణంలో జరిగిన అవకతవకలను, వాటి లెక్కలను చదివి వినిపించి కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అవినీతికి పాల్పడిందని స్పష్టం చేశారు.
ఇవి కాక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ సమస్య, ధరణి పోర్టల్‌లో అవకతవకలు ఇలా ఒకటొకటి తవ్వితీస్తూ బిఆర్ఎస్ నేతల మెడకు ఉచ్చులు సిద్దం చేస్తున్నట్లే ఉన్నారు.
ఇక మరో విషయం ఏమిటంటే, ఒకప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు కూడా ఇప్పుడు ఆయనను గౌరవిస్తుండటం గమనిస్తే, రేవంత్ ప్రభుత్వం బలపడిందని అర్దమవుతోంది. కనుక ఇప్పటికిప్పుడు రేవంత్ ప్రభుత్వానికి ఏ ప్రమాదం కనిపించడం లేదనే చెప్పాలి.
కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డిని తక్కువగా అంచనా వేస్తూ ఆయన ప్రభుత్వం కూలిపోతుందని బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎదురుచూస్తూ కూర్చోంటే, ఈ ఉచ్చుల కారణంగా వారి ఎమ్మెల్యేలే చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.