ఈరోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్పులు, అభివృద్ధిపై చాలా లోతైన చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడం వలన విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ రంగంలో కూడా భారీగా అవినీతికి పాల్పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు ఆరోపించారు.
వారి ఆరోపణలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గణాంకాలతో సహా తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ధీటుగా సమాధానం చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో జగదీష్ రెడ్డి సుమారు రూ.10 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించగా, దానిని జగదీష్ రెడ్డి ఖండిస్తూ కావాలంటే జ్యూడీషియల్ విచారణ జరిపించుకొమ్మని సవాలు విసిరారు.
దీనిపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, జగదీష్ రెడ్డి స్వయంగా కోరారు కనుక ఆయనకు అభినందనలు తెలియజేస్తూ మూడు అంశాలపై జ్యూడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నానని ప్రకటించారు.
1. 3-11-2014నాడు ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో 1,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు చేసుకొన్న ఒప్పందంపై విచారణ.
2. కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి కొత్తగూడెంలో ఇండియా బుల్స్ కంపెనీ చేత పవర్ ప్లాంట్ నిర్మాణంపై విచారణ.
3. యదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటుపై విచారణ.
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ని కూడా కమీషన్ల కోసం వాడుకొన్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ధరలో విద్యుత్ సరఫరా చేస్తామన్న కేంద్రాన్ని కాదని కేవలం కమీషన్ల కోసమే ఎక్కువ ధరకు ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకొన్నారని ఆరోపించారు.
Video Courtesy : ETV