ఇవి అప్పులు కావు.. భవిష్యత్‌కు పెట్టుబడులు: బిఆర్ఎస్

December 21, 2023


img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిందని ఆరోపిస్తూ మంత్రిత్వ శాఖలవారీగా వాటి ఆర్ధిక పరిస్థితిపై శాసనసభలో శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. 

అయితే ఈ ఆరోపణలను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు గట్టిగా తిప్పికొడుతూ తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరించి చెపుతున్నారు. మరోపక్క బిఆర్ఎస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ అప్పులు, అభివృద్ధికి సంబందించి గణాంకాలతో పాటు ఈ 9 ఏళ్ళలో తెలంగాణలో జరిగిన అభివృద్ధికి సంబందించి ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. 

తాజాగా ఇవి అప్పులు కాదు... భవిష్యత్కు పెట్టుబడులు అంటూ గత తొమ్మిదినరేళ్ళ బిఆర్ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన రుణాలతో చేసిన అభివృద్ధి పనులు మచ్చుకు కొన్ని అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. దానిలో కొత్త సచివాలయం, కేబిల్ బ్రిడ్జి, సాగునీరు, మిషన్ భగీరధ ప్రాజెక్టులు, హైదరాబాద్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లు, టీవర్క్స్, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, వైద్య కళాశాలలు, గురుకుల పాఠశాలలు మొదలైనవి చూపింది. 

కనుక అప్పులు-అభివృద్ధిపై రెండు పార్టీల మద్య జరుగుతున్న ఈ చర్చ చాలా అర్దవంతంగా సాగుతోందని చెప్పవచ్చు.


Related Post