కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పధకాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ పధకం క్రింద మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సులలో ప్రయాణించే సౌకర్యం కల్పించింది. మహిళలు ఈ పధకాన్ని విస్తృతంగా వినియోగించుకొంటున్నారు.
మహాలక్ష్మీ పధకం ప్రవేశపెట్టినప్పటి నుంచి టిఎస్‌ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దీంతో బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడిపోతున్నాయి.
కనుక టిఎస్‌ఆర్టీసీ ఆ మేరకు వారి ఆదాయం కోల్పోయి తీవ్రంగా నష్టపోతోంది. అందరికీ మహాలక్ష్మి కాసులు కురిపిస్తుంటే, టిఎస్‌ఆర్టీసీని మాత్రం దివాళా తీయించేసేలా ఉంది.
కనుక ఈ మహాలక్ష్మి భారాన్ని తగ్గించుకొనేందుకు టిఎస్‌ఆర్టీసీ అప్పుడే దారులు వెతుకుతోంది. ఆ ప్రయత్నాలలోనే ఇక నుంచి బస్సులలో ఉచితంగా ప్రయాణించాలనుకొనే మహిళలు తప్పనిసరిగా తమ ఒరిజినల్ గుర్తింపు కార్డుని చూపించాలనే షరతు విధించింది.
అంతేకాదు... ఆ గుర్తింపు కార్డులలో ఫోటో స్పష్టంగా లేకపోయినా, ప్రయాణికురాలిని గుర్తించలేనంత పాత ఫోటో ఉన్నా వాటిని అంగీకరించబోమని టిఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇకపై గుర్తింపు కార్డుల డూప్లికేట్ కార్డులను అంగీకరించబోమని చెప్పారు. కనుక మహిళలందరూ తప్పనిసరిగా తమ ఒరిజినల్ గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని వీసీ సజ్జనార్ సూచించారు.
మహిళలందరికీ మహాలక్ష్మి పధకం వర్తింపజేస్తున్నప్పుడు ఇక గుర్తింపు కార్డు అవసరం ఏముంది? అంటే తెలంగాణ స్థానికత కలిగిన మహిళలకు మాత్రమే ఈ పధకం అని టిఎస్‌ఆర్టీసీ కుంటి సాకు చెప్పుతోంది.
ఇటువంటి పధకం అమలుచేయడం టిఎస్‌ఆర్టీసీకి చాలా నష్టం కలిగిస్తుందని ముందే తెలిసి ఉన్నప్పుడు టిఎస్‌ఆర్టీసీ వీసీ సజ్జనార్ కొత్తగా అధికారంలోకి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డిని లేదా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి దీనిలో సాదక బాధకాలను వివరించి, పరిమిత బస్సులకే ఈ పధకాన్ని వర్తింపజేయాలని నచ్చజెప్పి ఒప్పించి ఉండాల్సి ఉంది.
కానీ వీసీ సజ్జనార్ ఈ ప్రయత్నం చేసిన్నట్లు లేదు. తమ ఆరు గ్యారెంటీలతో రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు. కానీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఈ మహాలక్ష్మి పధకంతో సహా ఇటువంటివే అనేక హామీలు ఇచ్చేశారు.
కనుక కష్టమైనా నష్టమైనా ఈ భారం మోయక తప్పదు. కానీ అప్పుడే మహాలక్ష్మికి షరతులు పెడుతూ ఆ భారం కాస్త అయినా తగ్గించుకోవాలని టిఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తోంది!