తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై నేడు శాసనసభలో మాజీ ఆర్ధిక మంత్రి హరీష్ రావు, సిఎం రేవంత్ రెడ్డికి మద్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది.
అప్పుల విషయంలో హరీష్ రావు వాదనలపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మేము చెపితే 80 వేల కోట్లతోకట్టిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని మమ్మల్ని అడిగారు. ఇప్పుడు దానికి నేను జవాబు చెపుతాను.
ఆర్ధికశాఖ తాజా నివేదిక ప్రకారం కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో మీరు తీసుకొన్న అప్పులే సుమారు రూ.90 వేల కోట్లున్నాయి. ఇవి కాక మీ ప్రభుత్వం దానిపై మరికొన్ని వేలకోట్లు ఖర్చు పెట్టింది. త్వరలో ఆ లెక్కలు కూడా తీయించి సభ ముందుంచుతాను.
కానీ కాళేశ్వరం కోసం మీరు చేసిన అప్పులే మీరు చెప్పుకొన్న దానికంటే ఎక్కువున్నాయని స్పష్టమైంది కదా? అంటే ఇంతకాలం మీరు అబద్దాలు చెపుతూ ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెడుతున్నారని ఒప్పుకొంటారా?
కాళేశ్వరం నీటిని రైతులకు, పరిశ్రమలకు అమ్ముకొంటామని దాని ద్వారా ఏడాదికి రూ.5, 090 కోట్లు ఆదాయం వస్తుందని దానితో అప్పులు తీర్చేస్తుందని మీరు బ్యాంకులకు అబద్దం చెప్పారు. ఇది నిజమా కాదా?
మిషన్ భగీరధ అప్పుల కోసం కూడా ఇదేవిదంగా త్రాగునీటిని ప్రజలకు అమ్ముకొని ఆ డబ్బుతో అప్పులు తీరుస్తామని బ్యాంకులకు చెప్పిన మాట వాస్తవమా కాదా?అంటే రైతులను, ప్రజలనే కాకుండా మీరు బ్యాంకులను కూడా మోసం చేశారన్న మాట!
మిషన్ భగీరధ రాక మునుపు తెలంగాణలో ప్రజలు ఎన్నడూ నీళ్ళు త్రాగలేదా? మీ కేసీఆరే స్వయంగా కైలాసం వెళ్ళి శివుడితో మాట్లాడి ఆయన శిరస్సున ఉండే గంగమ్మని భూమికి తీసుకువచ్చి మిషన్ భగీరధ ద్వారా ప్రజలకు నీళ్ళు అందించిన్నట్లు గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? అంటూ సిఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కానీ టిఎస్ ఐసీసీ అప్పుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇందుకు పూర్తి భిన్నంగా చెప్పిన విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి సభకు వివరించారు. టిఎస్ ఐసీసీ అప్పులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని మీరు అబద్దం చెప్పారు. కానీ ఆ సంస్థ అప్పులు తీర్చాల్సింది ప్రభుత్వమే కదా? అని నిలదీశారు.
మీ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా, కమీషన్ల కోసం ప్రాజెక్టులు, వాటికోసం విచ్చలవిడిగా అప్పులు తీసుకొని రాష్ట్రాన్ని దివాళా తీయించేసింది. కానీ మాజీ మంత్రిగా మీకున్న అనుభవంతో మీ తప్పులను తెలివిగా కప్పి పుచ్చుకొంటూ, తిరిగి మా ప్రభుత్వం బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు.
ఈవిదంగా అబద్దాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నందుకు మాజీ మంత్రి హరీష్ రావుపై శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుని తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు.