కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ గురించి ఎన్నికల సమయంలో అంతకు ముందు కాంగ్రెస్ నేతలు ఏమి ఆరోపణలు చేశారో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వివిద శాఖలు ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు, వాటిని దేనికోసం ఖర్చు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రతీశాఖ తమ ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటి ఆధారంగా శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నారు.
అలాగే మేడిగడ్డ కుంగడంపై కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించబోతున్నట్లు చెప్పారు కూడా. ధరణి పోర్టల్ ద్వారా బిఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు తమ పేరిట బదలాయించుకొన్నట్లు అనుమానిస్తున్నారు. కనుక దానిపై కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శాస్త్రీయంగా పరిశీలింపజేస్తున్నారు.
తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు కనబడుతోంది.
1. కేసీఆర్‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకొని బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం.
2. కేవలం ఐదుగురు ఎమ్మెల్యే అదనపు మెజార్టీతో నడుస్తున్న తమ కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థితరంగా కొనసాగేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ నుంచి ఆకర్షించడం.
3. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో చిల్లిగవ్వలేదని, కేసీఆర్ నిర్వాకం వలన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయుందని చెపుతూ ఆరు గ్యారెంటీ హామీలను అమలుచేయకుండా తప్పించుకోవడానికి కావచ్చు.