మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ... మరి విజయశాంతి?

December 19, 2023


img

హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో సోమవారం ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ ఛైర్మన్‌ మాణిక్‌రావ్ ఠాకూర్‌ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తమ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని సమావేశంలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.

గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు కనుక సోనియా గాంధీ అంగీకరిస్తే మెదక్ నుంచి పోటీ చేయాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ అభ్యర్ధన మేరకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ఇప్పుడు ఆమె స్వయంగా లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమెను గెలిపించుకొని కృతజ్ఞతలు తెలుపుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. 

ఎన్నికల సమయంలో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి గతంలో మెదక్ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆమెకు అవకాశం లభించలేదు కనుక మరోసారి మెదక్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే మరి విజయశాంతి పరిస్థితి ఏమిటి? ఆమెకు వేరే పదవి ఏదైనా అంటే రాజ్యసభకు పంపిస్తారా లేక ఎమ్మెల్సీగా మండలికి తీసుకువస్తారా? రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.


Related Post