తెలంగాణ ఎన్నికలతో జగన్‌కు షాక్... ఎమ్మెల్యేలకు షాక్ ట్రీట్‌మెంట్ !

December 18, 2023


img

“తెలంగాణ ఎన్నికలతో ఏపీకి సంబంధమే లేదు. వాటి ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉండబోదు. తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే మాకేమి... ఎవరు ముఖ్యమంత్రి అయితే మాకేమి?” అని అన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. 

అయితే ఏపీ సిఎం జగన్‌ మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో బాగానే షాక్ అయిన్నట్లున్నారు. పనితీరు బాగోలేనివారిని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుండా కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్ళినందునే అధికారం కోల్పోయారనే వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 

దీంతో జగన్‌ హడావుడిగా సుమారు 65 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చేస్తున్నారు. ఈ వార్తలను వైసీపి నేతలు కూడా ధృవీకరిస్తున్నారు. కనుక తెలంగాణ ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం మరో 3-4 నెలల్లో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపై చాలా తీవ్రంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. 

తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా కేసీఆర్‌ ఓడిపోయారు. కానీ జగన్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి సంక్షేమ పధకాల పేరుతో ఓటర్లకు డబ్బు పంచిపెడుతూ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయినప్పటికీ ఈసారి ఎన్నికలలో 175కి 175 సీట్లు మేమే గెలుచుకొంటామని చెప్పుకోవడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు.

ఇక ప్రతిపక్షాల సంగతి సరేసరి. జగన్‌ తన వైఫల్యాలకు, అనాలోచిత నిర్ణయాలకు తన ఎమ్మెల్యేలను బలిచేస్తున్నారని వాదిస్తున్నాయి. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఈ ఎమ్మెల్యేల మార్పిడిపై ట్విట్టర్‌లో స్పందిస్తూ, ““చెత్త ఎటు వేసినా చెత్తే.. ఒక చోట అసమర్ధులు, ఓడిపోతారు అని తెలిసిన క్యాండిడేట్స్ ని వేరొక చోటకు మార్చినంత మాత్రాన సమర్థులు ఎలా అవుతారు?జగన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అని అనుకోకండి. ఉల్లిగడ్డ అంటే పొటాటో అనే వ్యక్తి ఆలోచనా పరిధి అలాగే ఉంటుంది,” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. 


Related Post