తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచిందని బిఆర్ఎస్ వాదిస్తుండగా, కేసీఆర్ అహంభావం, నిరంకుశ పాలన, అవినీతిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ వాదిస్తోంది. కనుక ఈ రెంటి వాదనలలో ఏది నిజమో నిరూపించు కొనేందుకు మరో 10 రోజులలో అంటే 27వ తేదీన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగబోతున్నాయి.
శాసనసభ ఎన్నికల తర్వాత వెంటనే జరుగుతున్న ఈ ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటుకోవలసి ఉంటుంది. అప్పుడే దాని వాదనలకు బలం చేకూరుతుంది. లేకుంటే శాసనసభ ఎన్నికలలో ఏదో గాలివాటంగా గెలిచిందని బిఆర్ఎస్ నేతలు ఎగతాళి చేస్తారు.
తెలంగాణ సాధించి అభివృద్ధి చేసిన తమకు రాష్ట్రంలో తిరుగేలేదని బిఆర్ఎస్ అనుకొంటే, కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడం చాలా అవమానమే. ముఖ్యంగా కేసీఆర్ ముచ్చటపడి కట్టుకొన్న ప్రజాభవన్, సచివాలయంలో కాంగ్రెస్ నేతలు రాజభోగాలు అనుభవిస్తుండటం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు జీర్ణించుకోవడం చాలా కష్టమే.
కనుక సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ అనుబంద సంఘాన్ని ఓడించి ప్రతీకారం తీర్చుకొనేందుకు, తమ ఓటమి పరాభవం నుంచి తేరుకొనేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఓడిపోతే బిఆర్ఎస్ పతనం ప్రారంభం అయ్యిందనే ఊహాగానాలు మొదలైపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.
సింగరేణిలో సుమారు 40 వేలమంది కార్మికులు, వారి కుటుంబాలు కలిపి సుమారు రెండు లక్షల ఓట్లు ఉన్నాయి. కనుక ఈ ఎన్నికలలో ఏ పార్టీ అనుబంద సంఘం గెలిస్తే లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ లాభపడే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఎన్నికలు రెండు పార్టీలకి కూడా మరో అవకాశం మరో అగ్నిపరీక్ష వంటివే అని చెప్పవచ్చు.
మరి రెంటిలో దేని అనుబంధ సంఘాన్ని కార్మికులు గెలిపిస్తారో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ అనుబంద సంఘాన్ని గెలిపించుకొంటే ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతుంది. వరాలు కూడా ఇస్తుంటుంది. కనుక దానినే ఎన్నుకొనే అవకాశం ఉంది.