తెలంగాణ సాధన కోసం అనేక లక్షల మంది అనేక రకాల త్యాగాలు చేశారు. కొందరు తమ ప్రాణాలను బలిదానం చేస్తే కొందరు తమ పదవులు, ఉద్యోగాలు, చదువులు వదులుకొన్నారు. వారిలోనళిని కూడా ఒకరు. ఐపిఎస్ ఆఫీసర్ అయిన ఆమె డీఎస్పీగా పనిచేసేవారు. తెలంగాణ పోరాటాలలో పాల్గొనేందుకు కోసం ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
తెలంగాణ ఏర్పడింది కానీ ఆమె త్యాగాన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదు. ఈనేళ్ళ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆమెను తిరిగి పోలీస్ శాఖలోకి తీసుకొని అదే హోదాతో పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యే, మంత్రి పదవులు పొందుతున్నప్పుడు, ఆమెకు తిరిగి ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నించారు.
ఆమె ఉద్యోగానికి రాజినామా చేసి ఉద్యమాలలో పాల్గొనడం పోలీస్ శాఖ నియమ నిబంధనలకు విరుద్దమనుకొంటే, ఆమెను వేరే ఏదైనా శాఖలోకి తీసుకొని అదే హోదాకు సమాన ఉద్యోగం ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అమరవీరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమాలను ముందుండి నడిపించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ అమరవీరుల కుటుంబాలందరికీ న్యాయం జరుగలేదు. కనీసం ఉద్యమకారులపై పోలీస్ కేసులు ఎత్తివేయలేదు.
కానీ తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఇటువంటి త్యాగమూర్తులను కూడా గుర్తుంచుకోవడం, వారికి సముచిత స్థానం, గౌరవం కల్పించాలనుకోవడం చాలా అభినందనీయం.