మేడిగడ్డని అప్పజెప్పేశాం... దాంతో మాకు సంబంధం లేదు: ఎల్&టి

December 16, 2023


img

కాళేశ్వరం ప్రాజెక్టులో అతిప్రధానమైనది మొట్టమొదటి బ్యారేజి మేడిగడ్డ. దీని 7వ బ్లాకు అక్టోబర్ 21న క్రుంగింది. వెంటనే ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్‌ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు, ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్&టి కంపెనీ ఇంజనీర్లు, ప్రతినిధులు అందరూ వెళ్ళి పరిశీలించారు. దానిని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో సరిచేస్తుందని బ్యారేజి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రావు ప్రకటించారు.

కానీ ఎల్&టి సంస్థ జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్‌ ఈ నెల 2న ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు వ్రాసిన ఓ లేఖలో ఏమన్నారంటే... 

• మేడిగడ్డ నిర్మాణపనులు పూర్తి చేసి 2021, మార్చి 15న ప్రభుత్వానికి అప్పగించేశాము. ఈ మేరకు ఎస్ఈ మాకు ధృవీకరణ పత్రం ఇచ్చారు. 

• ప్రభుత్వం, ఎల్&టి సంస్థ మద్య జరిగిన ఒప్పందం ప్రకారం 2021, మార్చి 15 నుంచి రెండేళ్ళ పాటు అంటే 2023, మార్చి 15వరకు మేడిగడ్డ బ్యారేజిలో ఎటువంటి లోపాలు ఏర్పడినా దానికి పూర్తి బాధ్యత కంపెనీదే. 

• కానీ ఆ ఒప్పందం గడువు ముగిసి పోయిన తర్వాత అంటే 2023 అక్టోబర్ 21న బ్యారేజి క్రుంగినందున, దానికి ఎల్&టి కంపెనీ బాధ్యత వహించబోదు. 

• అయితే క్రుంగిన బ్యారేజిని సరిచేసేందుకు మళ్ళీ అనుబంద ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది. 

• ముందుగా బ్యారేజి వద్ద మరమత్తు పనులు నిర్వహించేందుకు వీలుగా కాఫర్ డ్యామ్‌ నిర్మించవలసి ఉంటుంది. దాని నిర్మాణానికి రూ.55.75 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.   

• ఆ తర్వాత బ్యారేజి మరమత్తులకు అయ్యే ఖర్చులు, జీఎస్టీ వగైరాలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఒప్పంద పత్రం వ్రాసుకొనేందుకు సిద్దపడితే ఎల్&టి కంపెనీ కూడా ఈ పనులు చేపట్టడానికి సిద్దంగానే ఉంది. 

ఇదీ ఎల్&టి కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్రాసిన లేఖ సారాంశం. 

మేడిగడ్డ బ్యారేజి క్రుంగినందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌, మంత్రులు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్దమవుతోంది. ఇప్పుడు ఎల్&టి వ్రాసిన ఈ లేఖతో రెండు పార్టీల మద్య పెద్ద యుద్ధమే ప్రారంభం కావచ్చు. చివరికి ఇది ఏ మలుపు తిరుగుతుందో రాబోయే రోజులలో తెలుస్తుంది.


Related Post